



ఏలూరు, ఫిబ్రవరి 2 : వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించనున్న ‘సిద్ధం’ సభ కోసం ఆ పార్టీ నాయకులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకుని పచ్చని పర్యావరణాన్ని ధ్వంసం చేశారు.
సీఎం జగన్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు అడ్డు వస్తున్నాయన్న మిషతో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లలో ఏపుగా పెరిగిన చెట్లను సగానికి నరికేశారు. దీంతో ఎటు చూసినా మొండి మానులే కనిపిస్తున్నాయి. మరోవైపు సభా స్థలి వద్ద ఉన్న ప్రధాన కాల్వలో మట్టిని పోసి దానిని కూడా పూడ్చేశారు.
ఈ కాల్వ ద్వారా పారే నీరు వేలాది ఎకరాలకు నీరందిస్తోంది. ఈ విషయం తెలిసి కూడా స్థానిక నాయకులు స్వామి భక్తి ప్రదర్శించారు. దీంతో పర్యావరణ ప్రేమికులు సహా.. స్థానిక రైతులు ఇదేం పని అంటూ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు.
