బాపట్ల, జనవరి 01.ఫిబ్రవరి : బాపట్ల జిల్లా మార్టూరులో గ్రానైట్ యజమానులపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అరెస్టు చేశారు.
వారిని రాత్రంతా స్టేషన్‌లో ఉంచి బుధవారం ఉదయం అద్దంకి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం వైసీపీ గూండాలతో కలిసి తనిఖీలకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్సు అధికారులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆరుగురు గ్రానైట్ పరిశ్రమ యజమానులను అర్ధరాత్రి స్టేషన్‌లోనే అదుపులోకి తీసుకున్నారు.
వారిలో కామినేని జనార్దన్, షేక్ రజాక్, మిన్నెకంటి రవికుమార్, అడుసుమల్లి వెంకట శ్రీనివాసరావు, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు పత్తిపాటి సురేష్, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల డీఎస్పీ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక సీఐ, ఆరుగురు ఎస్‌ఐలు, ఒంగోలు నుంచి వచ్చిన స్పెషల్ పోలీసులు 80 మంది, ఇంకా సిబ్బంది వందమందికిపైగా మార్టూరు సెంటర్లో బందోబస్తు నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేశారు.
