



విశాఖపట్నం 02 ఫిబ్రవరి: సీఎం జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నంపై కపట ప్రేమ చూపుతున్నారని తేలిపోయింది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. నాలుగున్నరేళ్లుగా భూమి కేటాయించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.
ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఢిల్లీలో కుండబద్దలు కొట్టారు. రైల్వే శాఖ స్వయంగా అడుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక్కడ చేజిక్కించుకున్న భూముల విలువ పెంచుకోవడానికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును మోదీ ప్రభుత్వం 2019లో ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం విశాఖలో నిర్మించడానికి గత బడ్జెట్‌లో రూ.107 కోట్లు కేటాయించింది. అందులో రూ.10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేసింది. కార్యాలయం నిర్మాణానికి 53 ఎకరాలను ముడసర్లోవ ప్రాంతంలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ ఇంతవరకూ దానిని రైల్వే శాఖకు అప్పగించలేదు.
