అమరావతి:28 ఫిబ్రవరి వైసీపీ శ్రేణులకు ‘మేం సిద్ధం…మా బూత్ సిద్ధం’ పేరుతో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలోనూ సీఎం జగన్.. చంద్రబాబు నామస్మరణే చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
విశ్వసనీయత అనే పదం వాడే అర్హతను జగన్‌రెడ్డి కోల్పోయారని విమర్శించారు. తెదేపా-జనసేన పొత్తు చూసి ఆయన భయపడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘సిద్ధం సభలకు స్పందన రాకపోవడంతో తన భజనమిత్ర మండలి సమావేశం పెట్టి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉండండని పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్న జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎంగా కాదుగదా.. ఆయన కనీసం రాజకీయ నాయకుడిగానూ అనర్హుడే. తలకిందులుగా తపస్సు చేసినా కుప్పంలో కాదుకదా.. కనీసం పులివెందులలోనూ గెలవలేరు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
