అల్లూరి సీతారామరాజు జిల్లా(ఆంధ్రప్రదేశ్), మార్చి 3: తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను ఏమాత్రం పట్టించుకోలేదని, గిరిజనులను చులకనగా చూసిందని, కనీసం గిరిజన మంత్రిని కూడా నియమించలేదని, అందువలన రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో సహా ఆ పార్టీతో జతకట్టిన పార్టీలను ఓడించాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అరకు నియోజకవర్గ సిద్ధం సభ ఆదివారం అరకులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో గిరిజన ప్రాంతాల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి అన్న విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. గిరిజన హక్కుల రక్షణకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 1/70 యాక్ట్ ను తీసుకొచ్చిన విషయాన్ని సుబ్బారెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేది కాదని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాడేరులో సుమారు 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారని ఆయన తెలియజేశారు. గిరిజనులు తమ సమస్యలను తెలియజేసుకోవాలంటే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గిరిజన ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా చేసి పరిపాలనను గిరిజనులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని ఆయన అన్నారు.
