కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లో మహిళలపై గూండాలు లైంగిక వేధింపులు పాల్పడ్డారని, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత షాజహాన్ షేక్ (Sheikh Shajahan)ను అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అతడిని అరెస్టు చేసి తీరాల్సిందేనని పోలీసులను ఆదేశించింది.
సందేశ్‌ఖాలీ వ్యవహారంపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆదివారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కేసులో పోలీసుల చేతులను కోర్టు కట్టేసింది. అందుకే షాజహాన్‌ను అరెస్టు చేయలేకపోతున్నాం’’ అని అన్నారు. సోమవారం ఈ కేసు కలకత్తా హైకోర్టులో విచారణకు రాగా.. అభిషేక్ వ్యాఖ్యలను అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు నిలుపుదల చేశారా? లేదా అన్నదానిపై స్పష్టతనివ్వాలని కోరారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మేం అరెస్టుపై ఎలాంటి స్టే విధించలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతడు (షాజహాన్) నిందితుడిగా ఉన్నాడు. అలాంటప్పుడు అతడ్ని అరెస్టు చేయాల్సిందే’’ అని స్పష్టం చేసింది. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
