భద్రాచలం, 14 అక్టోబర్ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో డిసెంబరు 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఉంటాయని ఈవో రమాదేవి వెల్లడించారు.
ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబరు 13న మత్స్యావతార దర్శనం, 14న కూర్మావతారం, 15న వరాహావతారం, 16న నరసింహావతారం, 17న వామనావతారం, 18న పరశురామావతారం, 19న శ్రీరామావతారం, 20న బలరామావతారం, 21న శ్రీకృష్ణావతారం, 22న శ్రీ తిరుమంగైలపై ఆళ్వారుల పరమ పదోత్సవం ఉంటుందని తెలిపారు. అదే రోజున గోదావరిలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారంలో పూజలు ఉంటాయి. జనవరి 8న విశ్వరూప సేవ ఉంటుంది.
ఆనెల 12న కూడారై ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. 14న భోగి సందర్భంగా శ్రీ గోదాదేవి కల్యాణం ఉంటుంది. 15న మకర సంక్రాంతి సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 13 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలు ఉండవని, డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస పూజలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.
