దిల్లీ 19, ఫిబ్రవరి సందేశ్ఖాలీ ఘర్షణల అంశంలో తమ ముందు హాజరు కావాలని లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ(సీఎస్), డీజీపీలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది.
పశ్చిమబెంగాల్ సందేశ్ఖాలీలో జరిగిన పరిణామాలపై ఆందోళన చేపట్టిన బీజేపీ ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై ఎంపీ సుకాంత మజుందార్ రాష్ట్ర సీఎస్, డీజీపీలపై లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ పశ్చిమ బెంగాల్ సీఎస్ భగవతి ప్రసాద్ గోపాలిక, డీజిపీ రాజీవ్కుమార్లను సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తుపై కోర్టు స్టే ఇచ్చింది.
