అమరావతి, విశాఖపట్నం,19.ఫిబ్రవరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ వారం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన ఈ వారంలోనే ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లనున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు విశాఖ నగరానికి వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పెదవాల్తేరులోని కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ కొంతసేపు కొణతాలతో ఏకాంతంగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 33 మందితో పవన్ సమావేశం కానున్నారు.
సోమ, మంగళవారాల్లోనూ విశాఖలోనే ఉండే పవన్.. నగర నాయకులతో పాటు భీమిలి, గాజువాక, చోడవరం, యలమంచిలి నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు.
