దిల్లీ ,05,ఫిబ్రవరి (హిం.స) దేశ వ్యాప్తంగా త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ భారత ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేసింది. పార్టీలు ఎన్నికల్లో తమ ప్రచారాలకు పిల్లలను ఉపయోగించుకోవద్దని సూచించింది. పోస్టర్లు, కర పత్రాల పంపిణీ, నినాదాలతో ఎక్కడైనా పిల్లలను ప్రచారంలో వాడుకున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ మధ్య రాజకీయ నేతలు పిల్లలను తమ పార్టీల ప్రచారం కోసం వాడుకుంటున్న తీరు కనిపిస్తోందని.. ఈ పరిణామం మంచిది కాదని తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో అధికారులు, పార్టీ నేతలు క్రియాశీల భాగస్వాములు కావాలని కోరారు.
