అమరావతి:05 ఫిబ్రవరి (హిం.స) పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. ఏడేళ్ల జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?.. అరెస్ట్ చేయనివ్వండి, అందుకు బాధ్యులైన అధికారులు పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని అధికారులను లోపలకి పంపిస్తామని, ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని వ్యాఖ్యనించింది. దీంతో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరడంతో తదుపరి విచారణ మంగళవారం నాటికి వాయిదా వేసింది.
