దిల్లీ ,05,ఫిబ్రవరి (హిం.స) జైలులో ఉన్న ఆప్(AAP) నేత సంజయ్ సింగ్ సోమవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆయన ప్రమాణానికి నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రివిలెజ్ కమిటీ ఆయనపై విచారణ జరుపుతోందని ఈ సందర్భంగా ధన్ఖడ్ వెల్లడించారు.
దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను ఆప్ మరోసారి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు ఏడురోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఫిబ్రవరి ఒకటిన సంజయ్.. దిల్లీ కోర్టును ఆశ్రయించారు. తర్వాత తన పిటిషన్ను వెనక్కి తీసుకొని. ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. జైలు అధికారులు పార్లమెంట్కు తీసుకువెళ్లాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన ఆయనకు నిరాకరణ ఎదురైంది. సంజయ్తో పాటు దిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మాలీవాల్, నారాయణ్ దాస్ గుప్తా ఆప్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వారి ప్రమాణస్వీకారం ఇప్పటికే పూర్తయింది.
