ఢిల్లీ ,24, డిసెంబర్ (హిం.స) వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్యలోని ఓ విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ డిసెంబరు 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలకూ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక రైలు దిల్లీ-దర్బంగా(బిహార్) మార్గంలో, మరో రైలు బెంగాల్లోని మాల్దా- బెంగళూరు మధ్య అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత వర్గాల సమాచారం. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ, పుష్-పుల్ రైలు. ముందు, వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతోపాటు, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్లు ఉండనున్నాయి. 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కాగా.. 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, రెండు గార్డు కంపార్ట్మెంట్స్ ఉంటాయి
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
