ఢిల్లీ ,,04, జనవరి (హిం.స) అయోధ్యలో రామవిగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుండగా.. 14 నుంచి 27వ తేదీ వరకు వేడుకల షెడ్యూలును ఖరారు చేశారు. ప్రాణప్రతిష్ఠ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఇంట్లో అయిదు దీపాలు వెలిగించేలా భాజపా కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం దేశంలో దీపావళి తరహా వాతావరణం కనిపించాలని వీరు కోరనున్నారు. జనవరి 25 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా భక్తులు రామమందిరాన్ని సందర్శించేలా తమ కార్యకర్తలు సహాయం చేయాలని, అందుకు తగ్గ కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా అగ్ర నాయకత్వం ఇప్పటికే సూచించింది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రోజూ 50 వేలమంది భక్తులు రాముణ్ని దర్శించుకుంటారని అంచనా. వీరికి ప్రయాణ, వసతి సౌకర్యాలు, ఇతర అంశాల్లో భాజపా కార్యకర్తలు సాయం చేయనున్నారు. ఇందుకోసం ఆరెస్సెస్ కార్యకర్తలతో భాజపా శ్రేణులు భుజం భుజం కలిపి నడుస్తాయని కమలం పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాలను ఎక్కడా ఉపయోగించరాదని భాజపా అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది.
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
