మైiలవరం, 05 ఫిబ్రవరి : పార్టీ కోసం నిరంతరం శ్రమించా.. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేశా.. అధిష్ఠానానికి నమ్మకం లేనప్పుడు, తానెలా పని చేయగలనంటూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యకర్తలు, నాయకులకు తోడ్పడేలా తాను చేసిన పనులపై ప్రతిపక్షాలు కూడా చేయని విధంగా అధినాయకత్వమే అభాండాలు వేస్తే తట్టుకోలేకపోయానని వాపోయినట్లు తెలిసింది. మైలవరానికి వేరొకరిని వైకాపా సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో నందిగామ మండలం ఐతవరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆదివారం ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం తనను దోషిలా ఎవరో రాసిచ్చిన ప్రశ్నలడిగిందని కృష్ణప్రసాద్ వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పనులకు బిల్లుల విషయంలో నాయకులు అసంతృప్తిగా ఉన్నారని తాను చెబితే, ఐప్యాక్ టీం సభ్యులు ప్రజలు ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
