దిల్లీ ,05,ఫిబ్రవరి : యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ సిద్ధమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. ఫిబ్రవరి 6 ఈ బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. డెహ్రాడూన్లో సీఎం ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బిల్లు ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ముఖ్యమంత్రికి అందజేసింది. రాష్ట్రంలో మతంలో సంబంధం లేకుండా పౌరులందరికీ ఏకరీతిన వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వ చట్టాల అందించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. మంగళవారం అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందితే.. స్వాతంత్య్రం అనంతరం యూసీసీ కోడ్ని ఆమోదించిన తొలి రాష్ట్రంగా దేశంలో ఉత్తరాఖండ్ నిలవనుంది.
