పీలేరు , 9 మార్చ్ వైసీపీ నాయకులు కర్రలతో టీడీపీ నాయకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలపుల పంచాయతీ ముంతావారిపల్లెకు చెందిన తెదేపా నాయకులు మురళీమోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, గంగిరెడ్డి, రమణారెడ్డి వేరుసెనగ బస్తాలను ట్రాక్టరులో వేసుకుని శుక్రవారం తలపులకు వెళుతున్నారు. రెడ్డివారిపల్లె వద్ద వైకాపా నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రమణారెడ్డి, హరినాథ్ వారిని అటకాయించి కర్రలతో దాడిచేశారు. మురళీమోహన్‌రెడ్డి తన అనుచరులతో ఇటీవల తెదేపాలో చేరారు. వైకాపాను కాదని, పార్టీ మారి ఎలా తిరుగుతారో చూస్తామని హెచ్చరిస్తూ ఈ దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ నాయకులు మురళీమోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, గంగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వృద్ధుడైన రమణారెడ్డి తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన్ను తిరుపతికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
