ఢిల్లీ 9 మార్చ్ మావోయిస్టులతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడిన దిల్లీ యూనివర్సిటీ (డీయూ) మాజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా (58) తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని, తాను నష్టపోయిన కాలానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బోధన వృత్తి మాని బతకలేనని అన్నారు. ఈ కేసులో నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న సాయిబాబాను డీయూ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కళాశాల 2021లో విధుల నుంచి తొలగించింది. హైకోర్టు తీర్పుతో గురువారం నాగ్‌పుర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ‘‘దుర్భర పరిస్థితుల మధ్య ఏడేళ్లు జైలులో గడిపిన నాకు ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నట్టుగా ఉంది. నన్ను ఉగ్రవాది అన్నారు.
నాపై ‘ఉపా’ కేసు పెట్టడంతో కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. నా దేహంలో ఏ అవయవం పనిచేయడం లేదు. జైలులో నాకు కేవలం పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఏవో కొన్ని పరీక్షలు చేయిస్తూ వచ్చారు. రెండుసార్లు అగ్నిపరీక్ష ఎదుర్కొన్నా. నాకు మద్దతుగా నిలబడి ఇబ్బందులు పడిన న్యాయవాదులు, స్నేహితులు, కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు’’ అంటూ సాయిబాబా కన్నీటిపర్యంతం అయ్యారు.
