తెలంగాణ : హైదరాబాద్ : 7ఫిబ్రవరి ( హింస)
దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ప్రయాణికుల కష్టాలతో పాటు కౌంటర్ వద్ద రైల్వే సిబ్బంది పడుతున్న బాధలను అర్థం చేసుకున్న టికెట్ కౌంటర్లలో చిల్లర వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. టికెట్‌కు చిల్లర దొరకని తరుణంలో డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో రైల్వే కౌంటర్లలో డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే 466 పీఓఎస్ మిషన్లు, యూపీఐ క్యూఆర్ కోడ్ లను అమర్చినట్లు ఎస్ సీఆర్ జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీంతో చిల్లర కష్టాలు తీరడమే కాకుండా టిక్కెట్టు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి కౌంటర్లలో టిక్కెట్లు కొనుగోలు చేసే సమయంలో చిల్లర కష్టాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు.
