విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 23 : జిల్లాలో ఎన్నికలలో రాజకీయ పార్టీలు ప్రచారానికి అనుమతులు తప్పనిసరి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నిర్వహణపై విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫారం -7, ఫారం-8లను (షెడ్యూల్ విడుదల ముందు తేదీ నాటికి వచ్చిన దరఖాస్తులకు) చట్టబద్ధమైన విధానంలో మార్చి 26వ తేదీ లోగా పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావుడిగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టవద్దని, క్రమపద్ధతిలో వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫారం-6లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా, ఇంటింటి ప్రచారానికైనా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నేరుగా గానీ, ఎన్కోర్ (Encore) పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను
వెంటనే పరిశీలించి సకాలంలో అనమతులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో సీజర్స్ అంశంపై ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఏమాత్రం అలక్ష్యం వహించకుండా సకాలంలో నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలో అనుసరిస్తున్న విధానాల గురించి, చేపడుతున్న చర్యల గురించి ఎం.సి.సి. జిల్లా నోడల్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ సీఈవోకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
