హైదరాబాద్, 8 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. నిన్న కురిసిన భారీ వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు పలు రహదారులు జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నరకం చూశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. మొత్తంగా నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
ఇవాళ కూడా అంటే శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకు ఎలాంటి వర్ష సూచన లేదన్నారు. సాయంత్రం వేళ పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించనున్నాయి. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
