తిరుమల , 12 డిసెంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల(డిసెంబర్) 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకి 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానిక కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 25వ తేది ఉదయం 10 నుంచి 27 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ కోరింది.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
