హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి. దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలు అర్పించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ” అని పేర్కొన్నారు.
ఇక ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ తక్కువ కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థలో, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. భారతదేశం ఆధునిక దిశగా సాగడానికి పునాదులు వేశారు అని గుర్తుచేశారు. సద్భావన దివస్ సందర్భంగా పలువురు నేతలు రాజీవ్ గాంధీ సేవలను స్మరించి ఆయనకు నివాళులర్పించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
