లక్నో:8ఫిబ్రవరి రైతులు మరోసారి తమ నిరసనను ఉధృతం చేశారు. ర్యాలీగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ప్రాజెక్టుల కోసం తమ నుంచి సేకరించి అభివృద్ధి చేసిన అబాడీ ప్లాట్లలో పది శాతం లేదా వాటికి సమానమైన పరిహారం ఇవ్వాలని రైతులు 2019 నుంచి డిమాండ్ చేస్తున్నారు. 2020లో నోయిడా అథారిటీ కార్యాలయం వద్ద బైఠాయించి చాలా రోజులు నిరసన తెలిపారు. దీంతో 2023 డిసెంబర్‌లో గ్రేటర్ నోయిడా అథారిటీ దిగి వచ్చింది. అభివృద్ధి చేసిన భూమిలో 10 శాతం రెసిడెన్షియల్ ప్లాట్లు రైతులకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
