నరసరావుపేట:08 ఏప్రిల్ బస్సుయాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. మంగళవారం ఉగాది వేడుకల్లో పాల్గొంటారని స్థానిక వైకాపా నేతలు ప్రచారం చేశారు. తాజాగా ఆ కార్యక్రమం రద్దు అయినట్లు తెలుస్తోంది. శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో ఉగాది వేడుకలు జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేశారు. దీని కోసం భారీ సెట్టింగ్ వేయడానికి ఈవెంట్ నిర్వాహకులు కొంత సామగ్రితో వచ్చినప్పటికీ వారిని వైకాపా నాయకులు వెనక్కు పంపేశారు. ఉగాది వేడుకలు లేవని, పంచాంగ శ్రవణం కూడా ఉండదని కొందరు వైకాపా నేతలు చెబుతున్నారు. ఆ రోజంతా గంటావారిపాలెంలోనే సీఎం విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా తాడేపల్లిలో పెద్ద సెట్టింగ్ వేసి అట్టహాసంగా వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. జగన్‌పై పొగడ్తలతోనే ఆ కార్యక్రమం సాగింది. దీంతో ఆ వేడుకలపై విమర్శలు సైతం వచ్చాయి. ఎన్నికల సమయంలో మళ్లీ అలాంటివి నిర్వహిస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని వైకాపా అధిష్ఠానం భావించి ఉగాది వేడుకలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
