కడలూరు, 8 జనవరి (హిం.స)
తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. దీని కారణంగా కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు జిల్లాల్లో జనవరి 8న సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 5.30 వరకు 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జిల్లా కలెక్టర్ చారు శ్రీ. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు సహాయ సిబ్బంది. పాఠశాలలే కాకుండా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలకు సోమవారం సెలవు ప్రకటించారు. జనవరి 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. రీషెడ్యూల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.
గడిచిన 24 గంటలుగా కరైకల్ (12.2 సెం.మీ), పుదుచ్చేరి (9.6 సెం.మీ), కడలూరు (9.3 సెం.మీ.), ఎన్నూర్ (9.2 సెం.మీ.) వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం జనవరి 7, 8న రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. డిసెంబర్లో దక్షిణ తమిళనాడులోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాసి, కన్నియాకుమారి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి. మైచాంగ్ తుఫాను చెన్నైలోని అనేక ప్రాంతాలతో వినాశనాన్ని సృష్టించింది. గత 24 గంటల్లో 120 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిస్తే.. కొన్ని చోట్ల 250 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. దీని కారణంగా విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ప్రజలు కటిక చీకటిలో అలాగే కాలం వెళ్లబుచ్చుతున్నారు.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
