అమరావతి, 20 ఆగస్టు (హి.స.) నూతన బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్, దరఖాస్తు రుసుములను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. లైసెన్స్ ఫీజు ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో ఎక్కువ మంది దరఖాస్తుదారులను ఆకర్షించే అవకాశముందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదాహరణకు.. గతంలో బార్ లైసెన్స్ ఫీజు కడపలో రూ.1.97 కోట్లు, అనంతపురంలో రూ.1.79 కోట్లు, తిరుపతిలో రూ.1.72 కోట్లు, ఒంగోలులో రూ.1.40 కోట్ల చొప్పున ఉండగా, ప్రస్తుతం ఈ నగరాల్లో రూ.55 లక్షలకు తగ్గించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో రూ.71 లక్షలున్న ఫీజును రూ.35 లక్షలకు కుదించారు. 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, 50వేలకు మించి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, ఐదు లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలకు రూ.75 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. ఇది రిటైల్ ఏ4 దుకాణాలతో పోలిస్తే 26-48 శాతం వరకు తక్కువ అని కమిషనర్ వెల్లడించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి బార్ లైసెన్స్‌లను బహిరంగ లాటరీ ద్వారా కేటాయిస్తామని తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
