అమరావతి) 25 అక్టోబర్ (హిం.స)రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి అప్పగించారు.
అయితే, ఈ పరీక్షలను నిర్వహించాలంటే ముందుగా నగదు తమ ఖాతాలో జమ చేయాలని ఏపీపీఎస్సీ నిబంధన విధించింది. ఈ మేరకు లెక్కలతో సహా ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనా అసలు ఇంత వరకు యూనివర్సిటీలు సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేయలేదు. గత రెండు నెలల నుంచి పదే పదే నోటిఫికేషన్ల జారీ ఆగిపోతోంది. ఇటీవల కూడా ఈ నెల 20న నోటిఫికేషన్లు ఇస్తామన్న ఉన్నత విద్యామండలి మరోసారి వాయిదా వేసింది. దీంతో ఇంత వరకూ నోటిఫికేషన్లపైనే స్పష్టత లేదు.
మరోవైపు, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు నగదు జమ చేయాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 18 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆర్జీయూకేటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు సుమారు 2వేల వరకు ఉంటాయని అంచనా వేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
