ఢిల్లీ, 20 ఆగస్టు (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం పలు పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులతో కూడిన ఈమెయిళ్లు అందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇవాళ ఉదయం 7:40 గంటల సమయంలో మాలవీయ నగర్‌లోని ఎస్‌కేవీ పాఠశాలకు, 7:42 గంటలకు ప్రసాద్ నగర్‌లోని ఆంధ్ర స్కూల్‌కు బాంబు హెచ్చరికలతో ఈమెయిళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పాఠశాల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇది కొత్తేమీ కాదు. కేవలం రెండు రోజుల క్రితం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు (డీపీఎస్) ఇలాగే బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్పుడు కూడా అధికారులు తనిఖీలు చేయగా, అది బూటకపు బెదిరింపు అని తేలింది.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
