విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్) : యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుందని అంటారు. రాజకీయాల్లోకి వచ్చిన అందరూ రాణించలేరు. అనుభవం తక్కువ ఉన్నా, అందరికన్నా భిన్నంగా ఆలోచించి, అందరి మన్నలలు అందుకున్న సార్ వాడే అసలైన నాయకుడు. అదే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. గాజువాక బరిలోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న నాయకుడిగా కొద్దికాలంలోనే పేరు తెచ్చుకున్నారు.
గాజువాకలో ఒకేషనల్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీరి కోసం డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. తనను గెలిపిస్తే గాజువాకలో పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్ల అభివృద్ధికి సంబంధించి మూడు నెలల్లో ఆడిట్ చేసి, వీటిని అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఆయా సామాజిక వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని చెప్పారు. గాజువాక ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ను, యాప్ను, వెబ్సైట్ ని కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. గాజువాకలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పాత గాజువాక నుంచి శ్రీనగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలిసి తొలి పునాదిరాయి వేసేది దీనికేనని అమర్నాథ్ హామీ ఇచ్చారు. అగనంపూడి టోల్గేట్ ను తొలగించే విషయమై ఎంత పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమర్నాథ్ వివరించారు. గాజువాక ప్రాంతం మీదుగా మెట్రో రైల్ నిర్మాణానికి రెండున్నర సంవత్సరాల క్రిందట ప్రణాళిక సిద్ధం చేశారని, ఇప్పటివరకు దానికి దిక్కు లేదని అమర్నాథ్ అన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మెట్రో పునాది వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు గాజువాకలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. గాజువాకలో మార్కెట్లను ఆధునికరిస్తామన్నారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తానని అమర్నాథ్ చెప్పారు. ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకమేనని దీనిపై ఎటువంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉంటామని అమర్నాథ్ స్పష్టం చేశారు.
