అమరావతి, ఫిబ్రవరి 5 ఫిబ్రవరి (హిం.స): శాసనసభా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే.. దానికి సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే.. అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని అసెంబ్లీవర్గాలు తెలిపాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. ఆ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టే వీలుంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.
