విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 1 జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 93 పరీక్షా కేంద్రాల్లో 82,776 మంది పరీక్షలకు హాజరువుతున్నారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 40,874 మంది (బాలురు 21,693, బాలికలు 19,181), ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 41,892 (బాలురు 21,800, బాలికలు 20,092 మంది) పరీక్షలు రాయనున్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారిని, ఇంకా జిల్లావ్యాప్తంగా తనిఖీలకు ఐదు ఫ్లయింగ్ స్వ్కాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.
