తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మే : తెలంగాణ కరుడు గట్టిన ఉద్యమకారుడు కొందూర్గు మాజీ వైస్ ఎంపీపీ గిరిజన ముద్దుబిడ్డ మంగులాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వీర్లపల్లి శంకర్ ప్రధాన అనుచరుడుగా ఉన్న సమయంలో బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిన సమయంలో శంకర్ వెంట అన్ని తానై ఉన్నాడు. ఆ తర్వాత మంగులాల్ నాయక్ తటస్థంగా ఉంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. తాజాగా మంగుల్ నాయక్ అనుచరులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మండల ఇంచార్జి శ్యామ్ సుంధర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ప్రస్థానం ఉన్న మంగులాల్ నాయక్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరుకోవడం పట్ల ఎమ్మెల్యే శంకర్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల పాత్ర తెలంగాణలో మరువలేనిదని ఎమ్మెల్యే శంకర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లభించలేదని అన్నారు. గతంలో మంగులాల్ నాయక్ ఇంటి నిర్మాణ సమయంలో కూడా అప్పటి పాలకులు కక్షతో ఆయన ఇంటిని కూల్చివేసిన సందర్భంగా రాద్ధాంతం జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల మంగులాల్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు.
