అమరావతి06 మే : రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడింటినుంచి 3.45 గంటల వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయంకంటే మోదీ అరగంట ముందే రానున్నారు. ఇక్కడినుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండటంతో సూర్యాస్తమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేశారు. రాజమహేంద్రవరం సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమహేంద్రవరం సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబునాయుడు హాజరవుతారు.
