తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మే : అరుణమ్మ రాజకీయాల ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చాగాడని, ఆమె వయసుకైనా కనీస గౌరవం ఇవ్వకుండా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే చిల్లర మాటలు సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ బిజెపి ఇన్చార్జ్ అందే బాబయ్య విమర్శించారు. సోమవారం షాద్ నగర్ ఏబి కాంప్లెక్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నరసింహ గౌడ్, యువ నాయకులు డి. ప్రశాంత్ ముదిరాజ్, నందిగామ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ చెన్నయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అందే బాబయ్య మాట్లాడుతూ.. బిజెపి అభ్యర్థి డీకే అరుణమ్మకు ప్రజలలో ఉన్న ఆదరణ చూడలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో డీకే అరుణ విజయం ఖాయం అయిపోయిందన్న సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డి స్పృహ తప్పి మతిస్థిమితం లేని విమర్శలు చేస్తున్నాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రెండు నియోజకవర్గాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లో ఓటమి తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి పరువు పోవడం ఖాయమని అన్నారు. రెండు చోట్ల ఎంపి సీట్లు బిజెపి కైవసం చేసుకుంటుందని అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా వాస్తవాలు తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి తన అక్కసు డీకే అరుణ పట్ల వెళ్లగక్కుతున్నాడని అన్నారు. ఓవైపు మల్కాజిగిరిలో మహిళా అభ్యర్థిని గౌరవించాలని అన్ని పార్టీలకు చెబుతుండగా ఇక్కడ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మాత్రం డీకే అరుణమ్మ పై అర్థంపర్థం లేని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక ఆడపిల్ల పట్ల మాట్లాడాల్సిన మాటలు ఇవి కావని సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ఒక అక్క లాంటిదని కనీసం ఆమె వయసుకైనా గౌరవ మర్యాదలు ఇవ్వాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆమెను ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరికాదని అన్నారు. డీకే అరుణమ్మ రాజకీయాలు చేసేటప్పుడు మీ స్థాయి ఎక్కడుందో మరవకూడదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు నువ్వు చిన్న పిల్లగాడివని ఆయన ఎద్దేవా చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులో తమ నియోజకవర్గంలో దాదాపు డీకే అరుణమ్మకు 1,20,000 పై చిలుకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో బిజెపి హవా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది గమనించాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కొనసాగుతుందని, అనవసరమైన మాటలు మాట్లాడి కాంగ్రెస్ భవిష్యత్తులో పరువు తీసుకోవద్దని హితబోధ చేశారు. ఓటమి భయంతో ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి దురుసు తగ్గించుకోవాలని సూచించారు. మరోసారి అరుణమ్మ పై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాషాయ దండు కదలి వస్తుందని హెచ్చరించారు.
