అమరావతి, 8 ఆగస్టు (హి.స.)
, తెదేపా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో తన ప్రాణానికి ప్రమాదం ఉందని నగరంలోని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కళాశాల వ్యవహారంపై తనను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాదితో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఆయనతో ఆలపాటి చరవాణిలో మాట్లాడిన మాటల ఆడియో అంటూ.. మీడియాకు విడుదల చేశారు.
‘కలిసి వస్తానంటే రా…’ ‘నాకు నువ్వు ఏం చేస్తున్నావో.. ఎక్కడకు వెళుతున్నావో అన్ని తెలుసు. దిల్లీ వెళ్లి ఇంప్లీడ్ పిటిషన్‌పై సంతకం చేసిన విషయం నాకు తెలుసు. దిల్లీలో నువ్వు కలిసిన కృష్ణారావు నాకు చెప్పరని ఎలా అనుకున్నావు. నాకు అన్నీ తెలుసు. నువ్వు బెంగళూరు వెళ్లావని చెప్పి దిల్లీ వెళ్లావని కూడా తెలుసు. గతంలో వివాదాలు సృష్టించిన వారు తిరిగి వచ్చారు. నువ్వు కూడా వస్తానంటే రా. వస్తే నేను చెప్పినట్లు వినాల్సిందే. కలిసి వస్తావో ముందుకు వెళతావో అంతా నీ ఇష్టం. నీ కుటుంబం జోలికి రాను. ఆ అవసరం నాకు లేదు. తప్పు చేసింది నువ్వు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. చిత్తశుద్ధిగా కలిసి నాతో నడిస్తే క్షమిస్తా. 13 ఏళ్లుగా నాతోనే ఉన్నావు కాబట్టి చెబుతున్నా. నీ గురించి చాలా సేకరించా. సీఐడీ వాళ్లు నీ సంభాషణలు మొత్తం తీశారు. కలిసి వస్తే నీకు ఉపయోగం’ అంటూ ఆలపాటి తనను బెదిరించారని శ్రీనివాస్ పేర్కొన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
