







కిర్లంపూడి:12 జనవరి (హిం.స) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇన్నాళ్లూ వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. తాజా పరిణామాలను పరిశీలిస్తే వైకాపాతో మైత్రి ఉండదని, ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది.
బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకుడు కల్వకొలను తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా ఆయనతో భేటీ అయ్యారు. గురువారం ఉదయం తెదేపాకు చెందిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొందరు తెదేపా నాయకులూ కలిసి ముద్రగడ ఇంటికి వెళ్లి దాదాపు 40 నిమిషాలపాటు ఆయనతో చర్చించారు. ఈ భేటీలు రాజకీయపరమైనవేనన్న చర్చ జరిగింది. జగ్గంపేట మండలం ఇరిపాకలో కోటి శివలింగార్చనకు ముద్రగడను ఆహ్వానించడానికే వెళ్లానని, హైకమాండ్ తనను పంపలేదని జ్యోతుల నెహ్రూ మీడియాకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నానని సహకారం ఇవ్వాలని కోరితే అందుకు ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ వెల్లడించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
