ఢిల్లీ 02, జనవరి (హిం.స) న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదనడం తప్పని, ఇందులో అత్యంత పారదర్శకత పాటించడం కోసం అనేక చర్యలు తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. నాలుగేళ్ల కిందట ఇచ్చిన అయోధ్యలో రామ మందిర నిర్మాణ తీర్పును ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా వెల్లడించారని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370పై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఏ తీర్పైనా రాజ్యాంగం, చట్టాలకు లోబడే ఉంటాయని తెలిపారు. తీర్పులు వ్యక్తిగత ఇష్టాల ప్రకారం ఉండవని, స్వలింగ వివాహాలపై ఇచ్చిన తీర్పులో విచారం వ్యక్తం చేయాల్సిందేమీ లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
