ఇంఫాల్:, 12, జనవరి (హిం.స)మణిపుర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లా పవర్ స్టేషను నుంచి భారీగా ఇంధనం లీక్ అయ్యింది. కంగ్పోక్పి జిల్లాలోని లీమాఖోంగ్ పవర్ స్టేషనులో ఈ ఘటన చోటుచేసుకొంది. లీకవుతున్న ఇంధనం నదుల్లోకి చేరకుండా సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రాత్రి పవర్ స్టేషను నుంచి భారీగా ఇంధనం వెలుపలికి రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామాల మీదుగా ఇది కాలువల్లా పారి, అక్కడక్కడా మంటలు చెలరేగాయి. జలచరాలకే కాకుండా నది నీటిపై ఆధారపడి బతుకుతున్న వర్గాలకూ ఇది ప్రమాదకరమే అని స్థానికుడు ఒకరు తెలిపారు. ఈ ఇంధనం దిగువ ఇంఫాల్ లోయలోని నదిలో కలిసే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం సిబ్బంది, యంత్రాలను తక్షణమే రంగంలోకి దించాలని అధికారులను ఆదేశించింది. గతేడాది మణిపుర్లో మొదలైన జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంధన లీకేజీ ప్రమాదవశాత్తు జరిగిందా.. దీని వెనుక దుండగుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
