కోల్కతా 28 జనవరి (హిం.స(చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి శ్రీల మజుందార్ (65) మరణించింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె కోల్కత్తాలోని తన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచింది. దీంతో బెంగాలీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. 1980లో ఆమె హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. 16 ఏళ్లకే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఏక్దిన్ ప్రతిదిన్, ఖరీజ్, అకలేర్ సంధానే వంటి సినిమాలు శ్రీలకి విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఏక్దిన్ ప్రతిదిన్ మువీకి సీక్వెల్గా వచ్చిన కౌశిక్ గంగూలీ ఆమె చివరి సినిమా. క్యాన్సర్ అని తెలిసాకా సినిమాలకు దూరమయ్యింది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్లు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. శ్రీలా తన కెరీర్లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. ఇక ఆమెకు భర్త , ఒక కొడుకు ఉన్నారు. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
