లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 12వ తరగతి బోర్డు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. గురువారం జరిగిన గణితం, జీవశాస్త్రం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూప్‌లో షేర్ అయ్యాయి. అయితే పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత ఇవి లీక్ అయ్యినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రిలో ఈ సంఘటన జరిగింది. రాజహౌలీలోని అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కుమారుడు ‘ఆల్ ప్రిన్సిపాల్స్ ఆగ్రా’ వాట్సాప్ గ్రూప్‌లో మ్యాథ్స్, బయోలజీ పరీక్షా పేపర్లు షేర్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతడి కుమారుడుతోపాటు మరి కొందరిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
