దిల్లీ: ఢిల్లీ,23, డిసెంబర్ (హిం.స) సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1 (Aditya L1)’ తన ప్రయాణంలో తుది అంకానికి సమీపించింది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు
‘ఆదిత్య ఎల్1 జనవరి 6వ తేదీన ఎల్1(లగ్రాంజ్ పాయింట్-1) పాయింట్లోకి ప్రవేశిస్తుందని మేం అంచనా వేస్తున్నాం. దీనికి సంబంధించిన కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ‘ఈ స్పేస్క్రాఫ్ట్ ఎల్1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ను మండిస్తాం. తర్వాత ఈ వ్యోమనౌక ఎల్1 కేంద్రంలో స్థిరపడుతుంది. అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఐదేళ్లపాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుంది’ అని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. అలాగే భారత స్పేస్ స్టేషన్ను నిర్మించేందుకు ఇస్రో ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
