

అమరావతి, డిసెంబరు 29(హిం.స): దేవదాయ శాఖలో పదోన్నతుల రగడ రాజుకుంటోంది. డిప్యూటి కమిషనర్ల (డీసీ) పదోన్నతులు కల్పించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు.
అయితే శాఖలో సీనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి డీసీ పదోన్నతుల వరకూ ఏది టచ్ చేసినా పెద్ద చిక్కుముడిగా ఉంది. అర్హత లేని వారికి, ప్రొబిషన్ డిక్లేర్ కానివారికి, ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి బదిలీ చేసి.. ఇష్టారాజ్యంగా పదోన్నతులు కల్పించారు. దీనివల్ల వివిధ కేడర్ల ఉద్యోగులకు కొన్నేళ్ల నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి.
గత పదేళ్ల నుంచి అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటి కమిషనర్ పదోన్నతులు నిలిచిపోయాయి. గ్రేడ్-1 ఈవోల పదోన్నతులు, ప్రధాన కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులు మొత్తం ఆగిపోయాయి. ఈ పదోన్నతుల వ్యవహారంపై పలువురు కోర్టులకు కూడా వెళ్లారు. ఈ పరిసితుల్లో పదోన్నతుల తేనెతుట్టెను దేవదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు కదుపుతున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
