

అమరావతి29 డిసెంబర్ (హిం.స): గౌరవ వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్న సొంత సైన్యంపై జగన్ ప్రభుత్వం కనికరం చూపలేదు. పైగా.. ప్రభుత్వంపైనే ధిక్కార స్వరం వినిపిస్తారా? అంటూ వారిని విధుల నుంచి తొలగిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమలాపురం పురపాలక సంఘం పరిధిలో గురువారం వాలంటీర్ల తొలగింపులు చేపట్టింది.
సమ్మె చేస్తున్నందున అమలాపురంలోని సూర్యనగర్, రామనగర్ ప్రాంతాలకు చెందిన వాలంటీర్లు రెడ్డి సతీశ్‌కుమార్, యనమదల ఉమామహేశ్వరరావు, ఎ.బాబాజన్‌లను తొలగిస్తున్నట్లుగా ఆ పురపాలక సంఘం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినందున వారి స్థానంలో ఇన్‌ఛార్జులకు బాధ్యతలు అప్పగించాలని సంబంధిత వార్డు సచివాలయాల పరిపాలన కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. ఈనెల 26 నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెకు దిగారు. అనేకచోట్ల అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
