తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో భారీగా పాలమూరుకు చేరుకున్న శ్రేణులు
తాను హైటెన్షన్ వైర్ లాంటోడినని ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు మహబూబ్ నగర్ టౌన్లో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, ఒకటి శ్రీహరి మధుసూదన్ రెడ్డి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎపీ జితేందర్ రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి స్థానిక నేతలు కాశీనాథ్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శివశంకర్ గౌడ్, యువనేత ఏపీ మిథున్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, జెడ్పిటిసిలు విశాలా శ్రావణ్ రెడ్డి వెంకటరామిరెడ్డి, అంతే మోహన్, గోటిక గోపాల్ రెడ్డి, లింగారెడ్డిగూడెం అశోక్, షాద్ నగర్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు. పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని… పాలమూరు లిఫ్ట్ ను కూడా పూర్తి చేయలేదన్నారు. గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పాలమూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని కోరారు సీఎం రేవంత్. వంశీచంద్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని.. తనకు ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి ఉందన్నారు సీఎం. కారు వర్క్ షాపు నుండి ఇంటికి రాదని.. తుక్కుకు అమ్మాల్సిందేనని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
