విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఫిబ్రవరి 26 విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ప్రయోగశాలను భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. స్థానిక పెదవాల్తేరు వద్ద గల ఇ.ఎన్.టి ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ప్రయోగ శాల ప్రారంభోత్సవ కార్యక్రమం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలతో పాటు ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖలో ఐఐఎం, నేడు కడప, మంగళగిరి ప్రాంతాల్లో ఎయిమ్స్, విశాఖలో ఆహార ప్రయోగశాల వంటివి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున భాగస్వాములై జ్యోతి ప్రజ్వలన చేసి, బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖలోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో రూ.4.77 కోట్లతో ఏర్పాటుచేసిన మైక్రో బయోలజీ ల్యాబ్ ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఈ ల్యాబ్ రాష్ట్రానికే గుండె లాంటిదని కొనియాడారు. దీంతో విశాఖతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో డయేరియా, ఇతర సమస్యలు వచ్చినపుడు ఆహరం, మంచినీటి నమూనాలను సేకరించి, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరిపేందుకు ఇక్కడ వసతులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. దీని ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, తక్కువ సమయంలో ఈ ప్రయోగశాలను పూర్తిచేసుకున్నామని తెలిపారు. త్వరలో 80 మంది సిబ్బందిని ఈ ప్రయోగశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయబోతుందని అన్నారు. విశాఖలో మైక్రో బయోలజీ ల్యాబ్ ఇచ్చినందుకు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసినందుకు భారత ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐపిఎం డైరెక్టర్ పూర్ణచంద్రరావు,
ఎన్. హెచ్. ఎం డిడి గణపతి రావు,ఏపీఎంఎస్ఐడిసి ఈఈ డి. అచ్చెంనాయుడు, ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ నంద, డి ఎం హెచ్ ఓ డా. పి. జగదేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
