అమరావతి టెట్, డీఎస్సీ పరీక్షలకు ఫీజులు కట్టి వివిధ కారణాలతో వాటికి అనర్హులుగా మారిన వారి ఫీజులను పాఠశాల విద్యాశాఖ వెనక్కి ఇస్తామని ప్రకటించింది. ఎప్పుడో ఇవ్వాల్సిన ఆ ఫీజులను గత వారం రోజుల నుంచి వెనక్కి ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే అందులోనూ అనేక మంది అభ్యర్థుల ఫీజుల విషయంలో గిమ్మిక్కులు చేస్తోంది. ఉదాహరణకు ఒక పేపర్‌కు రూ.750 చెల్లించిన అభ్యర్థికి అంతే మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉండగా.. రూ.7.50 తిరిగి చెల్లిస్తోంది. అంటే 750కి 7 తర్వాత చుక్క పెట్టి అక్షరాలా ఏడున్నర రూపాయలు ఖాతాల్లో వేసింది. ఈ నగదు చూసి అభ్యర్థులు అవాక్కయ్యారు. తాము రూ.750 కడితే మళ్లీ అంతే తిరిగి ఇవ్వాలి కానీ, ఇలా రూ.7.50 ఇవ్వడం ఏంటని లబోదిబోమంటున్నారు. మిగిలిన రూ.742.5 ఎవరు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్లు చేస్తుంటే వాటికి అధికారులు స్పందించడం లేదు. నాలుగు నెంబర్లలో కొన్ని పనిచేయడం లేదని, కొన్నిసార్లు ఫోన్లు తీసి మాట్లాడినా బ్యాంకుకు వెళ్లి చూసుకోవాలని నిర్లక్ష్యంగా సమధానం ఇస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఇలా నిరుద్యోగుల ఫీజులు కొట్టేస్తే ఇక తమకు దిక్కు ఎవరని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇది పొరపాటున జరిగిందని భావించినా రూ.7.50 పోగా మిగిలిన ఫీజులపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.
