కడప, 7 జూలై (హి.స.): వంకర్లు లేకుండా, అదరకుండా సింగపూర్ సింగారాలొలికించే అద్భుతమైన రోడ్లుగా రాయలసీమలోని జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. ముందున్న రహదారులను అభివృద్ధి పరచడంతో పాటు రెండు కొత్త రహదారులు నాలుగు వరుసల హైవేలుగా నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో రెండు కొత్త రహదారులు జాతీయ ప్రమాణాలతో పనులు జరుగుతుండగా రెండు రోడ్ల అభివృద్ధి, సొరంగ మార్గం పనులకు కేంద్రం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ రహదారులు పూర్తి అయితే రాయలసీమ గుండా ప్రధాన నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు అద్భుతమైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన, పటిష్టమైన జాతీయ రహదారుల వ్యవస్థకు రాయలసీమ ప్రత్యేకతను సంతరించుకోనుంది.
కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలో కడప అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి మధ్యలో ఉన్న తొమ్మిది కిలోమీటర్ల ఘాట్ రోడ్డు నిత్యం ప్రమాదాలకు దారితీస్తోంది. దేశంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్‌లో ఇదొకటిగా గుర్తించారు. ప్రతి నిమిషానికి ఒక వాహనం ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంది. ఈ ఘాట్ రోడ్‌లో భారీ వాహనాలు బ్రేక్ ఫెయిల్ అయి ఇతర వాహనాల మీద పడిపోవడం, వాహనాలు అదుపుతప్పి లోయలో పడిపోవడం, మలుపు వద్ద యాక్సిడెంట్లు జరగడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. అనేకమార్లు రాత్రి వేళల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు రక్తమోడిన సంఘటనలు ఉన్నాయి. ఇలా జరిగిన ప్రతిసారి వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ రోడ్డులో ప్రమాదాలను నివారించే క్రమంలో ఇక్కడ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాలని 2005 – 2010 మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. ఇప్పుడు ఆ పనులకు ఆమోదం పలికింది. రూ.920 కోట్లతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించింది. పది కిలోమీటర్ ఘాట్‌లో ఈ సొరంగ మార్గాన్ని ఎనిమిది కిలోమీటర్ల వరకు చేపట్టనున్నారు. బ్రిటిష్ కాలంలో గువ్వలచెరువు వద్ద పాలకొండలు దాటుతూ ఈ పెద్ద ఘాట్ రోడ్డు ఏర్పాటు అయింది. ఈ మార్గంలో చిత్తూరు, తమిళనాడు, కోయంబత్తూరు, రామేశ్వరం మార్గాల నుంచి కడప, కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు వేల సంఖ్యలో వాహనాలు వెళుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక ప్రణాళికలో ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిధులు కేటాయించారు. ఇక్కడ కొండను తొలిచి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇంజినీరింగ్ నిపుణులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి కొండ భాగం పటిష్టత, సొరంగం ఏర్పాటు చేసేందుకు ఎత్తుపల్లాలను పరిశీలించి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
