

కడప ,24 డిసెంబర్ (హిం.స): ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కోటిరెడ్డి కూడలి వద్ద వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, వివిధ స్థాయిల నాయకుల వ్యవహారశైలిపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆయన శనివారం సాయంత్రం కోటిరెడ్డి కూడలి ప్రారంభోత్సవానికి రాగా, ఇక్కడ సీఎంను కలవడానికి 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఏడు రోడ్ల కూడలి వద్ద మరికొందరు కలవడానికి అవకాశం కల్పించారు.
సమయాభావంతో అక్కడి ప్రారంభోత్సవం రద్దయింది. దీంతో ఇక్కడ సీఎంను కలవాల్సిన నాయకులు కూడా కోటిరెడ్డి కూడలికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన టెంటులో వారందరూ ముఖ్యమంత్రి కోసం నిరీక్షించారు. ప్రారంభోత్సవం తర్వాత జగన్ వారున్న టెంటులోకి వచ్చారు. తాను మైదుకూరు పర్యటనలో అందరినీ కలుస్తామని చెప్పారు. వెంటనే హెలిప్యాడ్‌కు వెళ్లాలని, టైం అవుతుందని చేతి గడియారంలో సమయాన్ని చూపారు. ఈ నేపథ్యంలో ‘సార్ మిమ్మల్ని కలవాలి… మాకు అవకాశం కల్పించండి ’ అని పలువురు నాయకులు కేకలు వేశారు. దీంతో ఆయన అసహనానికి గురై తాను అందరినీ కలిసే వెళతాను… రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుంటానని చెప్పారు. ఆయన స్పందనతో కలవరం చెందిన నాయకులు ‘సార్.. దయచేసి మీరు హెలికాఫ్టర్‌లో వెళ్లండి … మీ కాళ్లు పట్టుకుంటాం’ అని వేడుకున్నారు. ఆయన నాయకులతో మాట్లాడకపోయినా, వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన ఇడుపులపాయకు బయలుదేరారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
