అమరావతి, 27 నవంబర్ (హి.స.)మంత్రి లోకేశ్ తన పర్యటనలకు సంబంధించిన విమాన చార్జీలకు సొంత సొమ్ము వెచ్చిస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. కొంతమంది సమాచార హక్కు కార్యకర్తలు ఇప్పటికే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ అబద్ధాల పునాదులపై పుట్టిన జగన్ పత్రిక మాత్రం లోకేశ్ పర్యటనలపై అసత్య కథనాలు వండి వారుస్తోందని విమర్శించారు. జగన్ మీడియా, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ 77 సార్లు హైదరాబాద్‌కు విమానంలో వెళ్లారని, ప్రభుత్వ సొమ్మును విమాన చార్జీలకు దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పత్రికలో పేర్కొన్నారని, కానీ ప్రతి పర్యటనకు ఆయన తన సొంత సొమ్ము చెల్లిస్తున్నారని తెలిపారు. చివరికి ప్రభుత్వ అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధనకు వెళ్లిన పర్యటనలకు సైతం సొంత సొమ్మునే వెచ్చిస్తున్నారన్నారు. చినబాబు చిరుతిండి అని గతంలోనూ జగన్ పత్రిక తప్పుడు వార్తలు రాస్తే లోకేశ్ పరువు నష్టం కేసు వేశారని, అయినా వారి దొంగ బుద్ధి మారలేదని విమర్శించారు. జగన్ మాదిరిగా ఇంట్లో ఎలుకలు పట్టడానికి ప్రభుత్వ సొమ్ము దోచేయలేదని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి 15 కిమీ దూరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనలా ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానంలో వెళ్లలేదని అన్నారు. ఎంత తీరికలేని కార్యక్రమాలున్నా ఏడాదిన్నరలో లోకేశ్ 75 ప్రజాదర్బార్లు నిర్వహించి వేల మంది సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారని తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
